Andhra Pradesh: రైతులకు సెల్ ఫోన్లు, బంగారు గొలుసులు ఉండకూడదా?: గల్లా జయదేవ్
- రాజధాని రైతులపై పృథ్వీ వ్యాఖ్యలు
- మండిపడిన గల్లా జయదేవ్
- రైతులను అవమానించడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం
కొన్నిరోజుల కిందట అమరావతిలో రైతుల ఆందోళనలపై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ స్పందిస్తూ, ఆడి కార్లు, గోల్డ్ చెయిన్లు, ఖద్దరు షర్టులో కనిపిస్తున్నారు, వీళ్లంతా నిజంగానే రైతులేనా? అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తాజాగా స్పందించారు. రైతుల వద్ద సెల్ ఫోన్లు, బంగారు గొలుసులు ఉండకూడదా? అంటూ ప్రశ్నించారు.
భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న రైతులను చులకన చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న మహిళలు, రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మందడంలో రైతులకు సంఘీభావం తెలిపిన సందర్భంగా గల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.