USA: అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో మార్కెట్లు అతలాకుతలం.. దారుణంగా పతనమైన మన సూచీలు
- ఇరాన్ సైనిక జనరల్ ను చంపేసిన అమెరికా
- భగ్గుమంటున్న ముడిచమురు ధరలు
- డౌన్ ట్రెండ్ లో నడుస్తున్న అంతర్జాతీయ మార్కెట్లు
- భారత మార్కెట్లపైనా ప్రభావం
ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చిన నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యం తీవ్ర కుదుపులకు లోనైంది. ముడి చమురు ధరలు నాలుగు నెలల గరిష్టానికి చేరడంతో పాటు సూచీలు అంతకంతకూ పతనమవుతున్నాయి. ఈ ధోరణి భారత మార్కెట్లపైనా ప్రభావం చూపింది. ట్రేడింగ్ ఆరంభంలోనే దిగ్భ్రాంతికర ఫలితాలు కనిపించాయి. సూచీలు ఒక్కసారిగా డౌన్ ట్రెండ్ లోకి జారిపోయాయి.
సెన్సెక్స్ ఏకంగా 750 పాయింట్లకు పైగా నష్టం చవిచూడగా, నిఫ్టీ 12 వేల పాయింట్ల కిందికి పతనమైంది. క్లోజింగ్ బెల్ వరకు ఇదే పంథా కొనసాగింది. ట్రేడింగ్ చివరికి 788 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 40,677 వద్ద స్థిరపడగా, 234 నష్టంతో నిఫ్టీ 11,993 వద్ద ముగిసింది. అటు బంగారం ధరలు కూడా ఏడేళ్ల గరిష్టానికి చేరాయి.