Telugudesam: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు, మహిళల భారీ ర్యాలీ
- వెలగపూడి నుంచి మందడం వరకు కొనసాగిన ర్యాలీ
- జాతీయ జెండాతో 10 కిలోమీటర్ల మేర నిర్వహణ
- ర్యాలీలో పాల్గొన్న టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వెలగపూడిలో రిలే నిరహారదీక్ష చేపట్టిన వారికి మద్దతుగా రైతులు,మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాతో 10కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. తుళ్లూరు నుంచి మందడం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. యువత ద్విచక్రవాహనాలపై ర్యాలీలో కొనసాగుతుండగా, వృద్ధులు ట్రాక్టర్లపై నిరసన తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు రాజధాని రైతులు, మహిళల పాదయాత్ర వెలగపూడికి చేరుకుంది. పోలీసులు వీరి యాత్రను అడ్డుకున్నప్పటికీ రైతులు, మహిళలు యాత్రను కొనసాగించారని తెలుస్తోంది.
ఈ ర్యాలీకి పలు పార్టీలు మద్దతు పలికాయి. టీడీపీ సహా బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలు దీక్ష చేపట్టిన వారికి మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఇదిలావుండగా, ఈ రోజు విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ 24 గంటల నిరాహార దీక్షకు దిగడంతో ఆయనకు సంఘీభావం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా కూడా మద్దతుగా దీక్షకు దిగారు.