New Delhi: ఆ సంగతి చూడండి...జేఎన్‌యూ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ తో అమిత్ షా
![](https://imgd.ap7am.com/thumbnail/tn-9d30591ecaaf.jpg)
- విద్యార్థి ప్రతినిధులతో మాట్లాడాలని సూచన
- నష్ట నివారణ చర్యలు చేపట్టిన కేంద్రం
- ప్రశాంతంగా ఉండాలని వైస్ చాన్సలర్ పిలుపు
ఢిల్లీలోని జేఎన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. వర్సిటీ విద్యార్థులపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసి తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాడులకు మీరే కారణం అంటూ విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.
అయితే బాధితుల్లో ముఖ్యమైన వారు వామపక్ష భావజాలం ఉన్న వారు కావడంతో ఇది ఏబీవీపీ విద్యార్థి సంఘం పనే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్ తో ఫోన్లో ఈ రోజు ఉదయం మాట్లాడారు. అవసరమైన సూచనలు చేశారు. ఘటనపై పోలీసులు ప్రాథమిక ఆధారాలతో ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేశారు.
మరోవైపు వర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.జగదీష్ కుమార్ స్పందిస్తూ జరిగిన ఘటన దురదృష్టకరమని, విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో తరగతులు యథావిధిగా సాగుతాయని, వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ సజావుగా సాగేలా చూస్తామని తెలిపారు. కాగా, నిన్న ఘటనలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.