bse: యుద్ధ మేఘాల ప్రభావం... పడిపోయిన స్టాక్ మార్కెట్!

  • వరల్డ్ స్టాక్ మార్కెట్ల పతనం
  • ట్రంప్ వ్యాఖ్యలతో దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • 500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాల ప్రభావం, ప్రపంచ స్టాక్ మార్కెట్ ను దెబ్బతీశాయి. ఇరాన్ లోని 52 లక్ష్యాలను ఛేదించేందుకు క్షిపణులను సిద్ధంగా ఉంచామని ట్రంప్ చేసిన ప్రకటన, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో సాగుతుండగా, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ భారీగా నష్టపోయాయి.

ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం సమయంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 230 పాయింట్లకు పైగా నష్టంలో ఉన్న సెన్సెక్స్, ఆపై గంట వ్యవధిలోనే నష్టాన్ని 500 పాయింట్లకు పెంచుకుంది. ఉదయం 10.25 గంటల సమయంలో 486 పాయింట్ల నష్టంలో సాగుతూ, 41 వేల పాయింట్ల స్థాయి నుంచి కిందకు దిగి వచ్చింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, 152 పాయింట్ల పతనంతో 12,075 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

ఎన్ఎస్ఈ - 50లో కేవలం 5 కంపెనీల ఈక్విటీలు మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. టాప్ గెయినర్స్ గా ఫోర్స్ మోటార్స్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఓబీ, సుజలాన్ తదితర కంపెనీలుండగా, టాటా స్టీల్, శ్రీ ఇన్ ఫ్రా, చెన్ పెట్రో, ఎన్బీసీసీ, టైమ్ టెక్నో తదితర కంపెనీలు 5 శాతానికి పైగా నష్టాల్లో నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News