JC Diwakar Reddy: బీజేపీలో తాను ఎప్పుడు చేరేది చమత్కారంగా చెప్పేసిన జేసీ!
- జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి
- పీవోకేను బీజేపీ స్వాధీనం చేసుకుంటే ఆ పార్టీలో చేరుతా
- అప్పటి వరకు టీడీపీలోనే ఉంటా
బీజేపీలో తాను ఎప్పుడు చేరేది వెల్లడించారు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. అనంతపురంలో నిన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను జేసీ కలవడంతో ఊహాగానాలు వెల్లువెత్తాయి. జేసీ కమలం తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. జాతీయ పార్టీలతోనే దేశ పురోగతి సాధ్యమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ మార్పుపై సంకేతాలు ఇచ్చినట్టుగానే భావించారు. దీంతో స్పందించిన జేసీ మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను బీజేపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న రోజున ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా తగ్గిపోతూ ఉందన్నారు. అయితే, ప్రాంతీయ పార్టీలు కొనసాగే వరకు తాను టీడీపీలోనే ఉంటానని జేసీ తేల్చి చెప్పారు.