hotel tip: హోటల్ బిల్లు రూ.5,500...టిప్ 1.45 లక్షలు!
- న్యూఇయర్ రోజు జాక్ పాట్ కొట్టిన సర్వర్
- ఇండియానాలోని ఇల్లినాయిలో ఘటన
- ఫిదా అవుతున్న నెటిజన్లు
హోటల్ కి వెళితే బిల్లుతోపాటు సర్వర్ కు టిప్ చెల్లించడం సర్వసాధారణం. కితకితలు సినిమాలోని 'అత్తిలి సత్తిబాబు' లాంటివారైతే అర్థ రూపాయి, రూపాయి ఇస్తారేమోగాని, సాధారణంగా బిల్లును బట్టి పది, ఇరవై నుంచి ఓ వందదాకా కస్టమర్లు టిప్ ఇస్తుంటారు. అయితే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ కస్టమర్ సర్వర్ కి భారీ టిప్ ఇచ్చి షాకిచ్చాడు. తన హోటల్ బిల్ 5,500 అయితే (78 డాలర్లు) ఆమెకు టిప్ గా రూ.1.45 లక్షలు (2020 డాలర్లు) రాసిచ్చాడు.
వివరాల్లోకి వెళితే...ఇండియానాలోని ఇల్లినాయిస్ నగరంలో ఉన్న ఓ రెస్టారెంట్ కు డోర్నివాల్బర్గ్ అనే వ్యక్తి వెళ్లాడు. తనకు అవసరమైన ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. అతనికి అక్కడి మహిళా సర్వర్ 'బేధాని' ఆహార పదార్థాలు అందించింది. డోర్ని భోజనం పూర్తయ్యాక వెయిటర్ బిల్లు తెచ్చి పెట్టింది.
అందులో బిల్లు మొత్తం 78 డాలర్లు అని ఉంది. దీంతో అతను ఓ వంద డాలర్లు ఇస్తాడని బేధాని ఊహించి ఉంటుంది. కానీ, డోర్నివాల్బర్గ్ బిల్లుపై టిప్ గా 2020 డాలర్లు రాయడంతో ఆమెకు నోటమాట రాలేదు. పొరపాటు పడ్డాడేమోనని ఓసారి గుర్తు చేసింది.
దీంతో డోర్నివాల్బర్గ్ ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి “మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా' అని చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.