New Delhi: శునక 'రాజ'సం...కుక్కకు దుప్పటి కొని చలినుంచి రక్షణ కల్పించిన రిక్షావాలా!
- ఢిల్లీ వీధుల్లో చలి నుంచి రక్షణకు ఏర్పాట్లు
- ఈ ఫొటో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు
- రిక్షావాలా మానవత్వం పై ప్రశంసలు
మూగభాషను అర్థం చేసుకోవాలంటే మానవత్వం ఉండాలి. గుండెలోతుల్లో అభిమానాన్ని పెంచుకున్న వారికే అది సాధ్యమవుతుంది. ఇందుకు మంచి ఉదాహరణ ఢిల్లీలోని ఈ రిక్షావాలా. తన పెంపుడు శునకం కోసం అతను చేసిన పనిచూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఢిల్లీని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. తగిన రక్షణ లేకుండా మనుషులు బయటకు రాలేకపోతున్నారు.
సరే...మన ఏర్పాట్లు మనం చేసుకుంటాం. మరి మూగజీవాల మాటేమిటి? అందుకే ఈ రిక్షావాలా చర్యలు నెటిజన్ల ప్రశంసలకు పాత్రమయ్యాయి. నిత్యం తనవెంటే తిరిగే కుక్కకు కూడా చలివేస్తుందని, అది కూడా బాధపడుతుందని తెలుసుకున్నాడు. దానికోసం ప్రత్యేకంగా ఓ దుప్పటి సేకరించాడు.
చలి నుంచి , రక్షణకు తనెన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో, కుక్కకు ఆ దుప్పటి చుట్టి అంతే సంరక్షణ కల్పించాడు. ఈ దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో దీన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రిక్షావాలా మానవత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.