Botsa Satyanarayana Satyanarayana: సీఎం కాన్వాయ్ వెళుతుంటే పవన్ కల్యాణ్ ను ఆపరా?: బొత్స

  • తన కారును ఆపారని పవన్ చెప్పడం విడ్డూరం
  • సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు
  • ఘీంకారాలు చేస్తే సహించేది లేదన్న బొత్స

ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళుతుంటే ఎవరి వాహనాలనైనా ఆపుతారని, అది తన వాహనమైనా, పవన్ కల్యాణ్ వాహనమైనా ఒకటేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తన కారును ఆపారని పవన్ కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బొత్స, పోలీసుల దృష్టిలో ఎవరైనా ఒకటేనని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టిందని అన్నారు.

రూ. 1.10 లక్షల కోట్లతో ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మించాలని భావించడం లేదని వ్యాఖ్యానించిన ఆయన, ప్రభుత్వం ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని, కడపలో ఉక్కు కర్మాగారాన్ని కూడా పూర్తి చేయాల్సివుందని చెప్పారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడే చంద్రబాబులా తాము లేమని విమర్శలు గుప్పించారు. టిడ్కోలో రివర్స్ టెండరింగ్ కు వెళితే, 15 శాతం తక్కువకే పనులు జరిగే పరిస్థితి వచ్చిందని అన్నారు.

పవన్ కల్యాణ్ సహనం కోల్పోతే ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని, ఆయన సినిమాల్లో మాదిరిగా ఘీంకారాలు చేస్తే సహించేందుకు ఎవరూ సిద్ధంగా లేరని నిప్పులు చెరిగారు. ఇసుక విధానంపై పవన్ విమర్శలు అర్థరహితమని, తెలుగుదేశం పార్టీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుకను ఇప్పుడు డోర్ డెలివరీ చేస్తున్నామని చెప్పారు. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బొత్స అన్నారు.

  • Loading...

More Telugu News