Hyderabad: జనసంద్రం అంటే ఇదే... హైదరాబాద్ లో కదం తొక్కిన ముస్లింలు!
- హైదరాబాదులో ముస్లింల భారీ ర్యాలీ
- సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా నిరసన
- ప్లకార్డుల ప్రదర్శన
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హైదరాబాద్ కు కూడా పాకాయి. తాజాగా ప్రజాస్వామ్య వాదులు, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మిలియన్ మార్చ్ తరహాలో సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది ముస్లింలు తరలివచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇందిరాపార్క్, ధర్నా చౌక్, ట్యాంక్ బండ్, ఎల్బీ స్టేడియం, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో ప్రజలు రోడ్లపైకి రావడం ఇదే ప్రథమం. ఓవైపు జాతీయ పతాకాలు, మరో చేతిలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీఆర్ వ్యతిరేక నినాదాలు ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముస్లింలు కదం తొక్కారు.
ఈ నిరసన ప్రదర్శనలను 40 ముస్లిం సంఘాలతో కూడిన జేఏసీ నిర్వహించింది. గాంధీ, నెహ్రూ సాధించిన స్వాతంత్ర్యం తమకు మళ్లీ కావాలంటూ నినదిస్తూ ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎంబీటీ పార్టీ చీఫ్ అంజద్ ఉల్లా ఖాన్, తెహరీక్ ముస్లిం షబాన్ కన్వీనర్ ముస్తాన్ మాలిక్, అజీజ్ పాషా తదితర నేతలు పాల్గొన్నారు.
కాగా, ఈ ర్యాలీ కోసం ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకున్నాయి. మొదట అనుమతి నిరాకరించిన పోలీసులు ఆపై హైకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ధర్నా చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రధానంగా వుయ్ వాంట్ జస్టిస్, హమ్ లేకే రహేంగే ఆజాదీ, మోదీ చోర్ హై అనే నినాదాలు మిన్నంటాయి.