Kiran Bedi: నకిలీ వీడియో పోస్టు చేసి అభాసుపాలైన కిరణ్ బేడీ
- సూర్యుడు ఓం అంటున్నాడని ప్రచారం
- సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో
- నిజమని నమ్మిన కిరణ్ బేడీ
సోషల్ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో, అంతేస్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అలాంటివాటిలో ఫేక్ న్యూస్ గురించి ప్రథమంగా చెప్పుకోవాలి. క్షణాల్లో పాకిపోయే ఈ నకిలీ వార్తలను గుడ్డిగా నమ్మడంలో ప్రముఖులు కూడా అతీతులు కారు. తాజాగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి చేదు అనుభవం ఎదురైంది. గత కొన్నిరోజులుగా, సూర్యుడి గురించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. సూర్యుడి నుంచి ఓంకార ధ్వని వెలువడుతోందని, దాన్ని నాసా రికార్డు చేసిందని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ వీడియో ట్వీట్ విశ్వసనీయతను పట్టించుకోకుండా కిరణ్ బేడీ కూడా ఆ వీడియోను షేర్ చేశారు. దాంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఓ మాజీ ఐపీఎస్ అధికారిణి, ఓ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉంటూ ఇలాంటి వార్తలను నమ్ముతారా అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేయడం ప్రారంభించారు. మీలాంటి వాళ్లు కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తే మిగతా వాళ్ల సంగతేంటి? అంటూ ట్విట్టర్ ను హోరెత్తిస్తున్నారు.