Boston Committee: అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేలా బీసీజీ నివేదిక ఉంది: మోపిదేవి
- గతంలో పొరపాట్లను సరిదిద్దుకునే సమయం ఇది
- ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే మూడు రాజధానులు
- పారదర్శక నిర్ణయాలు తీసుకుంటుంటే రాజకీయం చేయవద్దు
పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేలా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ఉందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే సమయం ఇదని, ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే మూడు రాజధానుల ఏర్పాటును కమిటీ సిఫారసు చేసిందని అన్నారు.
పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాజధాని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. హైపవర్ కమిటీ ఈ నెల 6న సమావేశమవుతుందని, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇస్తామని చెప్పారు. మహిళలకు ఇబ్బంది కలిగించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, రైతులు నిన్న కొందరు పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అందుకే, వాళ్లు అలా వ్యవహరించి ఉండొచ్చని అన్నారు.