BCG Committee: ఆప్షన్-1 కింద విశాఖలో గవర్నర్, సీఎం కార్యాలయాలు, సచివాలయం: బీసీజీ నివేదిక
- విశాఖలో హైకోర్టు బెంచ్, అత్యవసర శాసనసభ
- అమరావతి కేంద్రంగా హైకోర్టు బెంచ్, అసెంబ్లీ
- కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచనలు
ఆప్షన్-1 కింద విశాఖలో గవర్నర్, సీఎం కార్యాలయాలతో పాటు సచివాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తన నివేదికలో సూచించినట్టు ఏపీ ప్రణాళికా కార్యదర్శి విజయ్ కుమార్ చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో హైకోర్టు బెంచ్, అత్యవసర శాసనసభ, ఇండస్ట్రీ- ఇన్ ఫ్రాస్ట్రక్చర్ శాఖలు, టూరిజం శాఖ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అమరావతి కేంద్రంగా హైకోర్టు బెంచ్, అసెంబ్లీ, ఎడ్యుకేషన్ కు సంబంధించి 3 హెచ్ ఓడీ ఆఫీసులు, అగ్రికల్చర్ కు సంబంధించి 4 హెచ్ఓడీ ఆఫీసులు, సంక్షేమ, స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్ఓడీ ఆఫీసులు, కర్నూలులో హైకోర్టు, పలు కమిషనర్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఆప్షన్-2 కింద.. విశాఖలో సచివాలయం, సీఎం ఆఫీసు, ప్రభుత్వ శాఖలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్; అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్; కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషనర్లు, అప్పిలేట్ సంస్థలు ఏర్పాటు చేయాలని సూచనలు చేసినట్టు తెలిపారు.
ఏపీసీఆర్డీఏ శ్వేతపత్రం- జూన్, 2019 ప్రకారం అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు అవసరమని, ఇందుకోసం ఏడాదికి దాదాపు ఎనిమిది వేల నుంచి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదికలో వెల్లడించినట్లు విజయ్ కుమార్ తెలిపారు. కానీ, రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయిందని, ఇప్పటికే రూ.2.25 కోట్ల రుణాలు ఉన్నాయని, కేవలం, ఒకే ఒక్క పట్టణం కోసం ఇంత ఖర్చు చేయడం ‘రిస్క్’తో కూడుకున్నదని బీసీజీ నివేదికలో తెలిపినట్టు చెప్పారు.