Insider Trading: ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తే నా భూములు ఫ్రీగా ఇచ్చేస్తా: పల్లె రఘునాథరెడ్డి
- రాజధాని అంశంలో మాటలయుద్ధం
- అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వైసీపీ
- ఖండిస్తున్న టీడీపీ నేతలు
- దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, దమ్ముంటే నిరూపించాలని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తే తన భూములు ఫ్రీగా ఇచ్చేస్తానని అన్నారు.
2016లో రైతుల అనుమతితోనే 2.52 ఎకరాల భూమి కొనుగోలు చేశానని వెల్లడించారు. కానీ వైసీపీ నేతలు 7.57 ఎకరాల భూమి ఉందంటున్నారని, మిగిలిన భూమి ఎక్కడుందో చెప్పాలని సవాల్ విసిరారు. దమ్ముంటే న్యాయవిచారణ జరిపించాలని అన్నారు. వైసీపీ నేతలు ఆర్కే, శ్రీదేవి, బ్రహ్మనాయుడు వంటివారు అక్కడ భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. తనపై అసత్య ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని రఘునాథరెడ్డి హెచ్చరించారు.