Tamilanadu: నిన్న బాణసంచా కూలీ.. నేడు గ్రూప్-1 అధికారిణి!

  • తమిళనాడులో బాణసంచా కార్మికురాలి విజయం 
  • రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు 
  • సబ్ కలెక్టర్, డీఎస్పీ పోస్టు వరించే అవకాశం

కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఆమెది శ్రమైక విజయం. లక్ష్య శుద్ధి, మొక్కవోని పట్టుదల ఆమెను విజయ తీరాలకు చేర్చాయి. బాణసంచా తయారీ కర్మాగారంలో రోజు కూలీగా పనిచేసిన ఆమె గ్రూప్-1 అధికారిగా ఎంపికై విజయానికి షార్ట్ కట్స్ లేవని నిరూపించింది. వివరాల్లోకి వెళితే...విరుద్ నగర్ జిల్లా తిరుకులై గ్రామానికి చెందిన గురుస్వామి, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె మహాలక్ష్మి. పేదరికంతో అల్లాడిపోతున్న కుటుంబానికి బాణసంచా కర్మాగారంలో పనే ఏకైక ఆధారం.

తల్లిదండ్రులతోపాటు మహాలక్ష్మి కూడా పనిచేస్తూ వచ్చేదానితో జీవనోపాధి పొందుతోంది. కుటుంబ అవసరాల నిమిత్తం కూలి పనులకు వెళ్తున్నా మహాలక్ష్మి చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటూనే డిగ్రీ పూర్తి చేసింది.

కొన్ని నెలల క్రితం తమిళనాడు ప్రభుత్వం సబ్ కలెక్టర్, డీఎస్పీ తదితర పోస్టుల భర్తీ కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీచేసింది. 181 పోస్టులకుగాను 29 వేల మంది దరఖాస్తు చేయగా, 9,442 మంది మెయిన్ కి అర్హత సాధించారు. 363 మంది ఇంటర్వ్యూకు హాజరుకాగా ఎంపికైన వారిలో టాప్-4 ర్యాంకులో మహాలక్ష్మి నిలిచింది.

ఆమెను సబ్ కలెక్టర్ లేదా డీఎస్పీ పోస్టు వరించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ తన కష్టానికి ఫలితం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే రెండు సార్లు తాను టీఎన్‌పీఎస్సీ పరీక్షలు రాశానని, మూడో ప్రయత్నంలో విజయం దక్కిందన్నారు. తన తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ఫలితం లభించిందని చెప్పారు.

  • Loading...

More Telugu News