Brian Lara: తన రికార్డు బద్దలుకొట్టే అవకాశం ఎవరికుందో చెప్పిన బ్రియాన్ లారా
- 400 పరుగులతో లారా వరల్డ్ రికార్డు
- ఇప్పటికీ చెక్కుచెదరని ఘనత
- వార్నర్, కోహ్లీ, రోహిత్ లకు చాన్సుందన్న లారా
క్రికెట్ ప్రపంచంలో బ్రియాన్ లారా ఓ సమున్నత శిఖరం. వెస్టిండీస్ దీవుల నుంచి వచ్చిన ఈ కళాత్మక బ్యాట్స్ మన్ ఔత్సాహిక క్రికెటర్లకు ఓ పాఠంలాంటి వాడు. లారా టెస్టుల్లో సాధించిన 400 పరుగుల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 15 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ పై ఓ టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో లారా 400 పరుగులు నమోదు చేశాడు. ఎంతోమంది ఆటగాళ్లు వస్తున్నా, పోతున్నా లారా రికార్డును బద్దలుకొట్టే మొనగాడు మాత్రం ఇప్పటివరకు రాలేదు. దీనిపై లారానే స్పందించాడు. ఒకవేళ తన రికార్డును చెరిపివేసే వీలున్న ఆటగాళ్ల గురించి చెప్పమంటే తాను డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లే చెబుతానని వెల్లడించాడు.
ఓపెనర్ గా వచ్చే వార్నర్ కు ఇది సాధ్యమేనని అన్నాడు. కోహ్లీ క్రీజులో నిలదొక్కుకుంటే అతడ్ని ఆపడం ఎంతో కష్టమని లారా అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ గురించి చెబుతూ తనదైన రోజున ఏమైనా చేయగలడని తెలిపాడు. స్టీవ్ స్మిత్ కూడా మంచి బ్యాట్స్ మన్ అయినా, అతడు నాలుగోస్థానంలో వచ్చి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం కొంచెం కష్టమైన విషయమేనని లారా అభిప్రాయపడ్డాడు.