Vijayawada: రైతుల ముసుగులో రాజకీయాలు చేయాలని చూస్తే సమర్థంగా ఎదుర్కొంటాం: మంత్రి వెల్లంపల్లి

- రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారు
- రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది
- కార్మికుల సంక్షేమం కోసమే ఆర్టీసీ విలీనం
ఓ మతానికో, కులానికో, వర్గానికో, రాజకీయానికో భయపడి పని చేసే తత్వం సీఎం జగన్ ది కాదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వివిధ శాఖల అధికారులతో, పార్టీ శ్రేణులతో కలిసి విజయవాడలోని పలు ప్రాంతాల్లో వెల్లంపల్లి ఇవాళ పర్యటించారు. తొలుత పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ లో పర్యటించిన వెల్లంపల్లి, స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారని చెప్పారు. రైతుల ముసుగులో రాజకీయాలు చేయాలని రాజకీయ పార్టీలు చేస్తున్న క్రీడను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని అన్నారు.
