North Korea: సరికొత్త వెపన్ రెడీ... ప్రపంచానికి త్వరలోనే చూపిస్తానంటున్న కిమ్ జాంగ్ ఉన్!
- స్వీయ నియంత్రణను ఎక్కువ కాలం కొనసాగించలేము
- ఆర్థిక ప్రయోజనాల కోసం భద్రతను పణంగా పెట్టబోను
- వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశాల్లో కిమ్
అతి త్వరలోనే ప్రపంచానికి సరికొత్త ఆయుధాన్ని (వెపన్) చూపించనున్నట్టు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి పరీక్షలు చేయరాదని తమంతట తాముగా విధించుకున్న స్వీయ నియంత్రణను ఇంకా ఎంతో కాలం కొనసాగించే అవకాశాలు లేవని ఆయన అన్నారు.
అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ కీలక సమావేశాల్లో కిమ్ చేసిన ప్రసంగాన్ని ఆ దేశ అధికార మీడియా ప్రచురించింది. ఆర్థిక ప్రయోజనాల కోసం భద్రతను పణంగా పెట్టాలని చూసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కాగా, 2013 నుంచీ న్యూ ఇయర్ లో ప్రజలను ఉద్దేశించి, ప్రసంగిస్తూ వచ్చిన కిమ్, ఈ సంవత్సరం మాత్రం ప్రజల ముందుకు రాలేదు.
అమెరికాతో చర్చలు విఫలం కావడం, 2019లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాల్సి వస్తుందని, వాటిని అంగీకరించలేకనే 2020 తొలి రోజు కిమ్ ఎటువంటి సందేశమూ ఇవ్వలేదని, దక్షిణ కొరియా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు పార్క్ వాన్ గాన్ అభిప్రాయపడ్డారు. కాగా, అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులపై స్వీయ నియంత్రణ విధించుకున్న ఉత్తర కొరియా, మధ్య శ్రేణి ఆయుధ సంపత్తిని మాత్రం భారీగా పెంచుకుంది.