JP Nadda: ఏపీ రాజధాని అంశంపై 4న స్పష్టత ఇవ్వనున్న బీజేపీ!
- ఏపీ రాజధాని అంశంపై బీజేపీలో స్పష్టత కరువు
- జీవీఎల్ వ్యాఖ్యలతో నేతల విభేదం
- గందరగోళానికి తెరదించనున్న నడ్డా
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం నెలకొన్న గందరగోళం నేపథ్యంలో తన వైఖరి ఏంటన్నది బీజేపీ స్పష్టం చేయనుంది. ఈ నెల 4న బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కడపలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అంశంలో తమ పార్టీ వైఖరి ఏంటన్నది ఆయన స్పష్టం చేస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అమరావతి అంశంపై కేంద్రం ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను కూడా సునిశితంగా గమనిస్తున్నట్టు సమాచారం.
ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్రం పాత్ర అంతగా ఉండదని, అది ఆయా రాష్ట్రాల అంతర్గత విషయమని పేర్కొన్నారు. అయితే, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అమరావతి నిర్మాణంలో కేంద్రం పాలుపంచుకుంటోందని, ఇప్పుడు అకస్మాత్తుగా దానిని తరలిస్తుంటే ప్రశ్నించే హక్కు కేంద్రానికి ఉంటుందని చెబుతున్నారు.
పార్టీలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుండడంతో స్పష్టత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 4న కడపలో పర్యటించనున్న నడ్డా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి చర్చకు ఫుల్‌స్టాప్ పెడతారని నేతలు చెబుతున్నారు.