assam: 'పులి'రాజాకు హీటర్ సదుపాయం: అసోం జూ అధికారుల ప్రయోగం
- చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం
- పులులకు ప్రాణాపాయం ఉంటుందన్న భయం
- ఎన్ క్లోజర్ల బయట ఏర్పాటుతో ఉపశమనం
అంతరించిపోతున్న జంతుజాలంలో పులి, సింహాల జాతులు కూడా వున్నాయి. ఒకప్పుడు భారతదేశం అటవీ ప్రాంతంలో వేలాది పులులు, సింహాలు తిరుగాడితే ఇప్పుడు వాటి సంఖ్య రెండంకెలకు పడిపోయింది. దీంతో పులులు, సింహాలను కాపాడుకోవడం తప్పనిసరిగా మారింది. అందుకే అసోం జూ అధికారులు చలి నుంచి పులులు, సింహాల సంరక్షణకు హీటర్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఉత్తరాదిని చలి తీవ్రంగా వణికిస్తోంది. చాలాచోట్ల పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఈశాన్య భారతం సంగతి చెప్పక్కర్లేదు. చలి కారణంగా జూలోని మూగజీవాలు గజగజలాడుతున్నాయి.
దీన్ని గురించి అసోం రాజధాని గువాహటి జూ అధికారులు ఆయా జంతువుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పలు రకాల చర్యలు చేపట్టగా, పులులు, సింహాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఎన్ క్లోజర్ల బయట హీటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుత చలిని తట్టుకోలేని పులులు, సింహాలు ఎక్కువ సేపు హీటర్ల ముందు గడుపుతుండడం అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది.