Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర చేరికలు తగ్గాయంటున్న డీజీపీ

  • 2018తో పోలిస్తే 2019లో 30 శాతం తగ్గిన చేరికలు
  • 2018లో ఉగ్ర సంస్థల్లో 218 మంది చేరిక
  • కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొందన్న డీజీపీ

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతున్న యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉగ్రవాదుల సంఖ్య గణనీయంగా తగ్గడాన్ని బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇదే విషయాన్ని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ నిన్న వెల్లడించారు. ఉగ్రవాదం అణచివేతకు తీసుకుంటున్న చర్యల వల్ల ఉగ్రవాద సంస్థల్లో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు ఆయన తెలిపారు. 2018తో పోలిస్తే 2019లో ఇది 30 శాతం తగ్గినట్టు చెప్పారు.

2018లో జమ్మూకశ్మీర్‌కు చెందిన 218 మంది యువకులు ఉగ్రవాదం వైపు మళ్లగా, 2019లో అది 139కి తగ్గిందన్నారు. అలాగే, శాంతిభద్రతలకు సంబంధించి 625 ఘటనలు జరగ్గా, ఈసారి 481 మాత్రమే జరిగినట్టు వివరించారు. 2019లో 160 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా, 102 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

తాము చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 80 శాతం విజయవంతమైనట్టు డీజీపీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లలో 160 మంది ఉగ్రవాదులు హతమవగా, జమ్మూకశ్మీర్‌కు చెందిన 11 మంది పోలీసులు సహా 72 మంది భద్రతా సిబ్బంది అమరులైనట్టు తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొందని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ పేర్కొన్నారు.

Jammu And Kashmir
terrorists
  • Loading...

More Telugu News