Pawan Kalyan: జగన్ ధర్మం తప్పారు.. ధర్మం తప్పిన వ్యక్తిని ఈ నేల క్షమించదు: పవన్ కల్యాణ్
- అమరావతి మాకు ఇబ్బందని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చెప్పాల్సింది
- ముఖ్యమంత్రి అయన తర్వాత మాట తప్పారు
- కొన్ని జిల్లాలకే సీఎం అనే విధంగా వ్యవహరిస్తున్నారు
ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని రైతులను జగన్ మోసం చేశారని అన్నారు. అమరావతి రాజధానిగా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుందని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ స్పష్టంగా చెప్పి ఉంటే... భూములు ఇచ్చే విషయంలో రాజధాని రైతులు ముందుకు వెళ్లేవారు కాదని అన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటున్నామని చెప్పి... ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. జగన్ ధర్మం తప్పారని... ధర్మం తప్పిన వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఈ నేల క్షమించదని అన్నారు. ఎర్రబాలెంలో రైతులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రైతులకు అండగా ఉంటానని మాట ఇస్తున్నానని పవన్ అన్నారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ రాజధాని అని ఇప్పటికీ ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని అన్నారు. జగన్ ను 13 జిల్లాల ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని... ఆయన మాత్రం తాను కొన్ని జిల్లాలకే సీఎం అనే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.