Pawan Kalyan: ఇది ప్రజలపై ప్రజాప్రతినిధులు చేసిన అత్యాచారం: పవన్ కల్యాణ్
- మనకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాదు.. రాజధాని నగరం కావాలి
- ప్రభుత్వం మారితే అమరావతి భవిష్యత్తు ఏమిటనే ఆందోళన గతంలోనే వ్యక్తం చేశా
- రాజధాని భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉండటం దారుణం
రాజధాని నిర్మాణం చాలా కష్టసాధ్యమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటికే మనం హైదరాబాదును పోగొట్టుకున్నామని... మనకు కావాల్సింది కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాదని... ఒక రాజధాని నగరం కావాలని చెప్పారు. ఒక నగరాన్ని నిర్మించాలంటే దశాబ్దాలు పడుతుందని అన్నారు. అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా ఆ ప్రాంతంలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు సంఘీభావం ప్రకటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రబాలెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అమరావతికి 3 వేల ఎకరాలు చాలని తొలుత తాను అనుకున్నానని... రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు తనకు భయమేసిందని పవన్ చెప్పారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు భూములు ఇవ్వలేదని... అద్భుతమైన రాజధాని కోసం భూములు ఇచ్చారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం మారిపోతే అమరావతి భవితవ్యం ఏమిటని గతంలోనే తాను ఆందోళన వ్యక్తం చేశానని తెలిపారు.
అమరావతి బాండ్లను రిలీజ్ చేసి, సీఆర్డీఏ అనే చట్టాన్ని చేసిన తర్వాత కూడా రాజధాని భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉండటం దారుణమని పవన్ అన్నారు. ఇది ప్రజలపై ప్రజాప్రతినిధులు చేసిన అత్యాచారమని... ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కచ్చితంగా అత్యాచారమేనని... ఎవరికీ చెప్పుకోలేని అత్యాచారమని అన్నారు. చెప్పుకుంటే ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ అసమానతలు వస్తాయని చెప్పారు.