Robo: రాత్రిపూట దంపతులను కంగారుపెట్టిన రోబో వాక్యూమ్ క్లీనర్!
- యూఎస్ లోని కరోలినాలో ఘటన
- రాత్రిపూట పని చేస్తూ ఇరుక్కుపోయిన రోబో
- దొంగని భయపడి పోలీసులకు ఫోన్
ఆ దంపతులు ఎంతో ముచ్చటపడి ఓ రోబో వాక్యూమ్ క్లీనర్ ను కొనుగోలు చేశారు. సూచించిన సమయంలో ఇంటిని శుభ్రం చేయడం దాని పని. ఏదైనా పొరపాటు పడి దానికి వేరే టైమ్ సెట్ చేశారో ఏమోగానీ, అది ఓ రాత్రి పూట పనిచేయడం ప్రారంభించింది. ఆపై అక్కడ జరిగిన ఘటనలను అమెరికాలోని ఉత్తర కరోలినాకు చెందిన థామస్ మిలన్ తన ఫేస్ బుక్ లో వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఒక రోజు ఇంట్లో థామస్, ఆయన భార్య టీవీలో సినిమా చూస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో ఏవేవో శబ్దాలు వినిపించాయి. అదేదో పిల్లి, ఎలుకలు చేసిన శబ్దంలా అనిపించకపోవడంతో ఎవరో ఆగంతుకుడు ఇంట్లోకి దొంగతనం కోసం ప్రవేశించాడని భావించారు. ఆ దొంగను కాల్చి చంపాలని థామస్ తన గన్ ను చేతిలోకి తీసుకున్నాడు. అయితే, శబ్దాలు తన రెండేళ్ల కుమారుడి గదిలో నుంచి వస్తుండటంతో ముందడుగు వేయడానికి ఆందోళన చెందాడు.
ఆ వెంటనే 911కు ఫోన్ చేశారు. ఆపై కాసేపటికి పోలీసులు వచ్చారు. ఇల్లంతా వెతికి చూశారు. ఎక్కడా దొంగ లేడని నిర్ధారించి, అదే విషయాన్ని చెప్పగా, అప్పుడు థామస్ కు తన ఇంట్లో జరిగిన పొరపాటు గురించి తెలిసి వచ్చింది. తాను ఎటువంటి షెడ్యూల్ ఇవ్వకుండానే, ఇంటిని శుభ్రం చేసే పనిలో రోబో పడిపోయిందని, ఈ క్రమంలో మెట్ల కింద ఇరుక్కుపోయి శబ్దాలు చేస్తోందని గ్రహించాడు. పోలీసులకు క్షమాపణలు చెప్పి పంపించాడు.