Sankranti: సంక్రాంతి కష్టం... హైదరాబాద్ నుంచి అన్ని బస్సుల రిజర్వేషన్లు పూర్తి!
- జనవరి రాకుండానే రిజర్వేషన్లు పూర్తి
- అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి
- మరిన్ని రైళ్లు, బస్సులను కోరుతున్న ప్రయాణికులు
పెద్ద పండగ సంక్రాంతి. ప్రతి ఒక్కరికీ ఈ పండగ శుభవేళ, సొంత ఊరుకు వెళ్లాలని, అయినవాళ్లు, బంధుమిత్రులతో గడపాలని ఉంటుంది. కానీ వెళ్లే దారేది? ప్రతి సంవత్సరం మాదిరిగానే, జనవరి నెల రాకుండానే, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు నిండిపోయాయి. సంక్రాంతి పర్వదినం కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధం అవుతుండగా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వెళ్లే రెగ్యులర్ బస్సుల రిజర్వేషన్లు ఇప్పటికే ముగిశాయి.
రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు ఏపీఎస్ఆర్టీసీ, ఇటు టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ధర 50 శాతం అధికంగా ఉన్నా, కనీసం ఆ బస్సుల్లోనైనా సొంతూరుకు వెళ్దామన్న ఉద్దేశంలో ఉన్న ప్రజలు, వాటిల్లోనైనా రిజర్వేషన్ దొరుకుతుందేమోనన్న ఆశతో ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఆదిలాబాద్, కడప, కనిగిరి, ఒంగోలు, మార్కాపురం, మచిలీపట్నం తదితర ప్రాంతాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు కూడా నిండిపోయాయి. సంక్రాంతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3,414 బస్సులతో పాటు ఏపీ నుంచి 1,526 బస్సులు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆన్ లైన్ లోనూ, బస్ స్టేషన్లలోనూ రిజర్వేషన్లు చేయించుకోవచ్చని చెబుతున్నారు.
ఇక 5వ తారీకు నుంచి రైళ్ల పరిస్థితి మహా ఘోరంగా ఉంది. అన్ని ప్రధాన రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 300 దాటిపోయింది. ఇప్పుడు రైల్లో ఊరికి వెళ్లాలని ప్రయత్నిస్తే, వారికి బెర్త్ కాదుకదా, కనీసం ఆర్ఏసీలో సీటు లభించే అవకాశాలు కూడా లేవు. ప్రత్యేక రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధాన నగరాల నుంచి మరికొన్ని రైళ్లను వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.