Gold: కొత్త ఏడాదిలో రూ.45 వేలకు చేరనున్న బంగారం ధర!
- కొత్త ఏడాదిలోనూ కొనసాగనున్న ధరల పెరుగుదల
- రూపాయి మారకం విలువ క్షీణత, వినియోగదారుల డిమాండే కారణం
- పసిడి వినియోగంలో గ్రామీణ ప్రాంతాలదే అధిక వాటా
కొత్త సంవత్సరంలో బంగారం ప్రియులకు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. 2020లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 45 వేల వరకు చేరుకోవచ్చని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. పసిడిపై దిగుమంతి సుంకం పెంపు, డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణత, వినియోగదారుల డిమాండ్ వంటివి ఈ ఏడాది ధరల పెరుగుదలకు కారణం కాగా, కొత్త ఏడాదిలోనూ ధర పెరుగుదల కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
భౌగోళిక రాజకీయ పరిణామాలకు తోడు, రూపాయిలో హెచ్చుతగ్గులు వంటివి బంగారం ధరను రూ.45 వేలకు చేర్చవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఈ ఏడాది బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ విధానాలు, స్టాక్ మార్కెట్ల వృద్ధి వంటివి ప్రభావం చూపడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో బంగారం ధరలు పైకి ఎగశాయి.
పసిడి డిమాండ్‌లో గ్రామీణ ప్రాంతాల వాటానే ఏకంగా 70 శాతం వరకు ఉంటుందని, వచ్చే రెండుమూడేళ్లలో బంగారం మార్కెట్ సరికొత్త గరిష్ఠ స్థాయులకు చేరుకుంటుందని అఖిల భారత జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ అభిప్రాయపడ్డారు. 2020లో పది గ్రాముల బంగారం ధర రూ.38,000-42,000 మధ్య ఉండే అవకాశం ఉందని భారత బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ (ఐబీజేఏ) జాతీయ అధ్యక్షుడు పృథ్వీరాజ్ కొఠారి అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్జాతీయంగా ఏర్పడే పరిస్థితుల కారణంగా ఈ ధర రూ.45 వేల వరకు చేరవచ్చని కామ్ ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అన్నారు.