janasena: అమరావతి రైతులకు న్యాయం చేయకపోతే తీవ్ర పరిస్థితులు ఉంటాయి: వైసీపీ ప్రభుత్వానికి పవన్ హెచ్చరిక
- ‘నవరత్నాలు’ అమలు చేసే పరిస్థితి లేదు
- ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా ఉండే పన్నాగం
- అందుకే, మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు
‘నవరత్నాలు’ ను అమలు చేసే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదని, ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఈ విషయమై ప్రశ్నించకుండా ఉండేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిజానికి, ప్రజలకు అండగా ఉండాలని వైసీపీ ప్రభుత్వానికి లేదని, రాయలసీమకు హైకోర్టును, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని లేదని, కేవలం, ప్రజలను ‘కన్ఫ్యూజ్’ చేయాలన్నది ఉద్దేశ్యమని అన్నారు.
వైసీపీ నాయకుల ఒత్తిడికి గురై అక్రమ కేసులు బనాయించవద్దని పోలీస్ శాఖకు విన్నవిస్తున్నానని పవన్ అన్నారు. మానవత్వంతో, విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. ‘కంచే చేను మేస్తే’ అన్నట్లుగా ప్రజాప్రతినిధులే మోసం చేస్తే ప్రజలు ఇంకెక్కడికి వెళతారని ప్రశ్నించారు.
తిరుగుబాటు, విప్లవం వస్తే అది ఏ పరిస్థితులకైనా దారి తీయొచ్చని, అలాంటివి కావాలంటే ‘మేము సిద్ధంగా ఉన్నాం’ అని, ‘మీరు సిద్ధంగా ఉన్నారో? లేదో? ఓసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రధాని మోదీతో శిలాఫలకం వేయించిన అమరావతిని మార్చేస్తానంటే చాలా పెద్ద స్థాయిలో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అమరావతి రైతులను ఎలా రక్షిస్తారో చెప్పాలని, వారికి న్యాయం చేయకుండా ముందుకెళ్తానంటే మాత్రం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.