Mangalagiri: రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్
- రాజధాని ఏర్పాటు విషయమై ప్రజలతో చర్చించాలి
- ఒక చోట నుంచే పరిపాలించాలి..అంతటా అభివృద్ధి చేయాలి
- రాజధాని రైతులకు నా ప్రాణాలు అడ్డువేస్తా
రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఏం తప్పు చేశారు? భూములు ఇవ్వడం వారు చేసిన పాపమా? నిద్రాహారాలు మాని రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ఏంటి వారికి? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఈ విషయమై సమష్టి నిర్ణయం తీసుకోవాలని, ప్రజలతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఒక చోట నుంచే పరిపాలించాలని, అన్ని చోట్లా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
జనసేన రైతు పక్షపాతి అని, రైతు కన్నీరుపెట్టడం మంచిది కాదని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం, ప్రజలు బాగుండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చారని, అమరావతి రైతులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రైతులపై, వారి కుటుంబాలపై అక్రమ కేసులు పెట్టినా, ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా, వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా, బలవంతులైనా సరే, ‘నా ప్రాణాలు అడ్డువేస్తానని మాట ఇస్తున్నా’ అని అన్నారు.
‘జగన్ రెడ్డి గారికి కూడా చెబుతున్నాను.. విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలంటే, ప్రజలను విడగొట్టి విభజిస్తానంటే మేము చేతులు ముడుచుకుని కూర్చోం’ అని హెచ్చరించారు.