Janasena: వైసీపీ ప్రభుత్వం ధర్మం తప్పింది: పవన్ కల్యాణ్
- రాజధానిగా అమరావతి వద్దని నాడు జగన్ ఎందుకు చెప్పలేదు?
- రైతులు తమ స్వార్థం కోసం ఈ భూములివ్వలేదు
- రైతు కన్నీరు పెట్టిన నేల ఏదైనా సరే దహించేస్తుంది
అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేదని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఎందుకు చెప్పలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మంగళగిరిలో తమ పార్టీ నేతలతో నిర్వహించిన విస్తృత సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆ రోజునే ఆ మాట జగన్ చెప్పినట్టయితే రైతులు భూములు ఇచ్చేవాళ్లే కాదేమో, పెట్టుబడులు పెట్టిన వాళ్లు పెట్టే వాళ్లు కాదేమో అని అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి ఏర్పాటుకు నాడు జగన్ అంగీకరించినందువల్లే ప్రజలు నమ్మి మరిన్ని భూములు ఇచ్చారని చెప్పారు. టీడీపీ కాకపోయినా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా అమరావతికి ఢోకా ఉండదన్న ఉద్దేశంలో నాడు రాజధాని ప్రాంత వాసులు ఉన్నారని అన్నారు.
ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుస్తామనడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించాలని అన్నారు. రాజధాని రైతులు తమ స్వార్థం కోసమేమీ తమ భూములు ఇవ్వలేదని, చేతికొచ్చిన పంటను కూడా వదిలేసుకుని రైతులు త్యాగం చేశారని గుర్తుచేశారు. రైతుకు న్యాయం జరగనప్పుడు వారు కన్నీరు పెట్టిన నేల ఏదైనా సరే, అది దహించేస్తుందని, వైసీపీ ప్రభుత్వం ధర్మం తప్పిందని విమర్శించారు.