Andhra Pradesh: రాజధాని తరలింపుపై పిటిషన్... విచారణ చేపట్టిన హైకోర్టు
- హైకోర్టుకు చేరిన రాజధాని తరలింపు వ్యవహారం
- పిటిషన్ దాఖలు చేసిన రాజధాని రైతు పరిరక్షణ సమితి
- తదుపరి విచారణ జనవరి 23న ఉంటుందన్న హైకోర్టు
ఏపీ రాజధాని తరలింపు అంశం హైకోర్టుకు చేరింది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. వాదనల సందర్భంగా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీని ఎవరు నియమించారో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, ప్రభుత్వం నుంచి తగిన సమాచారం రాలేదని అడ్వొకేట్ జనరల్ బదులిచ్చారు.
ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 21 నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ఇరువర్గాలను ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 23న ఉంటుందని పేర్కొంది. కాగా, రాజధాని రైతు పరిరక్షణ సమితి తన పిటిషన్ లో జీఎన్ రావు కమిటీ చట్టబద్ధతను కూడా ప్రశ్నించింది. ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, తక్షణమే పిటిషన్ పై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.