CAA: పాక్ లో అల్పసంఖ్యాక వర్గాల శాతం అంతగా ఎలా తగ్గిపోయింది?: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • వీళ్లందరూ గాలిలో ఎగిరిపోయారా?
  • భూ గర్భంలో కలిసిపోయారా?
  • వేధింపులకు పాల్పడి మత మార్పిడి చేశారా?

పౌరసత్వ సవరణ చట్టం అనేది భారతీయుల హక్కులను తీసేసేది కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోమారు స్పష్టం చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లో అల్ప సంఖ్యాక వర్గాలుగా ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు ఆయా దేశాల్లోని మతపరమైన కక్ష సాధింపు ధోరణులకు గురవుతున్నారని, అక్కడ ఇమడలేకపోతున్నారని అన్నారు. అటువంటి వారు ఎవరైతే శరణార్థులుగా ఇక్కడికి వచ్చారో వారికి పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం ఇదని వివరించారు. ఇలాంటి చట్టంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ముస్లింలలో అభద్రతాభావం కలగజేసి, వారిని తమ వైపు తిప్పుకోవాలని వివిధ రాజకీయపార్టీలు అపోహలు సృష్టించాయని విమర్శించారు.

ఆయా దేశాల్లో ఉన్న అల్పసంఖ్యాక వర్గాలకు మన దేశంలో ఎందుకు పౌరసత్వం కల్పిస్తున్నామన్న దానికి చారిత్రక కారణం ఉందంటూ చరిత్రలోకి వెళ్లారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం మత ప్రాతిపదిక దేశ విభజన జరిగిందని, మన దేశం, పాక్ లో ఉన్న మైనార్టీలను సంరక్షించాలన్న ఉద్దేశ్యంతో నాడు ఇరు దేశాల ప్రధానులు ఢిల్లీలో ఓ ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఆ ఒప్పందాన్ని మన దేశం నెరవేర్చింది కానీ, పాకిస్థాన్ నెరవేర్చలేదని, అందుకే, పాక్ లో 23 శాతం ఉన్న అల్పసంఖ్యాక వర్గాలు నేడు కేవలం 3 శాతానికి తగ్గిపోయాయని వివరించారు.

పాక్ లో అల్ప సంఖ్యాక వర్గాల శాతం ఇంతగా తగ్గిపోయిందంటే వీళ్లందరూ గాలిలో ఎగిరిపోయారా? భూ గర్భంలో కలిసిపోయారా? వేధింపులకు పాల్పడి మత మార్పిడి చేశారా? ఈ వేధింపులు తట్టుకోలేక భారతదేశానికి శరణార్థులుగా వలస వచ్చారా? అని ప్రశ్నించారు. ఆయా దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించి ఉంటే వలస వెళ్లే వారు కాదుగా అన్న జీవీఎల్, పాకిస్థాన్ ని తప్పుబట్టాల్సిన కాంగ్రెస్ లాంటి రాజకీయపార్టీలు ఆ దేశానికి వత్తాసు పలుకుతూ, పాక్ భాషను భారతదేశంలో మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. అలాగే, ఒకప్పుడు బంగ్లాదేశ్ లో 22 శాతం ఉన్న మైనార్టీల శాతం ఇప్పుడు ఎనిమిదికి తగ్గిపోయిందని అన్నారు.

  • Loading...

More Telugu News