Peddireddy: రాజధాని రైతులను ముంచేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు: చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం
- జర్నలిస్టులపై దాడి జరిగితే చంద్రబాబు స్పందించలేదన్న పెద్దిరెడ్డి
- ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీత
- రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న మంత్రి
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కేసులు పెడితే చంద్రబాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడి జరిగితే చంద్రబాబు కనీసం స్పందించలేదని అన్నారు. చంద్రబాబు రాజధాని రైతులను ముంచేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
అంతకుముందు ఆయన మాట్లాడుతూ, అభివృద్ది ఒకే చోట కేంద్రీకృతమైతే ఇబ్బందులొస్తాయని, గతంలో హైదరాబాద్ విషయంలో ఇదే పరిస్థితి తలెత్తిందని అన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి మంచిదే కదా? అంటూ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు పరోక్ష మద్దతు తెలిపారు. రాజధాని రైతుల భూములకు ఎలాంటి ఢోకా ఉండదని, మంచి ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. రైతుల భూములపై హైపవర్ కమిటీ స్పష్టత ఇస్తుందని వెల్లడించారు.