CPI Narayana: దొంగల్ని కాపాడడంలో చంద్రబాబు, జగన్ ఒకే తాను ముక్కలు : సీపీఐ నారాయణ
- అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ గా మార్చారు
- జగన్ రాజధాని భూములు సెజ్ లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు
- మళ్లీ ప్రజల తీర్పుకోరి ఆయన రాజధాని మార్చుకోవచ్చు
భూ దోపిడీ దొంగల్ని కాపాడడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తాజా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దొందూ దొందేనని, ఇద్దరూ ఒకే తాను ముక్కలని సీపీఐ సీనియర్ నాయకుడు కె.నారాయణ విమర్శించారు. రాజధాని మార్పు అంశం, రైతులు నిరసన దీక్షలపై ఆయన స్పందించారు. రాజధాని భూములు ప్రభుత్వాలకు సొంత ఆర్థిక ప్రయోజనాలకు వేదికగా మారాయన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేల ఎకరాలు సేకరిస్తే, ఆ భూములను సెజ్ ల పేరుతో పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం జగన్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.
రాజధానిని మార్చాలని జగన్ అనుకుంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ప్రజాతీర్పు కోరాలని సూచించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం అమలు చేయతల పెట్టిన ఎన్సీఆర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలని దుయ్యబట్టారు. ఎన్సీఆర్ గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని నారాయణ ప్రశ్నించారు.