SBI: తగ్గనున్న ఈఎంఐ... వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
- ఈబీఆర్ ను పావు శాతం తగ్గించిన ఎస్బీఐ
- గృహ, ఎంఎస్ఎంఈ రుణగ్రస్తులకు ఊరట
- స్టాక్ మార్కెట్లో ఈక్విటీ 2 శాతం పతనం
ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి గృహ, వాహన రుణాలతో పాటు ఎంఎస్ఎంఈ రుణాలను తీసుకున్న వారికి శుభవార్త. వారి నెలవారీ ఈఎంఐ కొంత తగ్గనుంది. ఈబీఆర్ ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ ను 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతమున్న 8.15 శాతం ఈబీఆర్ ను 7.80 శాతానికి తగ్గించామని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది.
ఈ నిర్ణయం కారణంగా రెపో రేటుతో అనుసంధానించబడిన రుణ వినియోగదారులకు లబ్ది కలుగనుంది. తాజా నిర్ణయంతో తగ్గింపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎనిమిది సార్లు వడ్డీ రేటును తగ్గించినట్లు అవుతుంది. ఇక కొత్త సంవత్సరంలో గృహాలను కొనుగోలు చేయాలని భావించే వారికి 7.90 శాతం వడ్డీ రేటుకే రుణాలు లభించనున్నాయి. కాగా, బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం నికర లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. బ్యాంకు ఈక్విటీ ఈ ఉదయం మార్కెట్ లో 2 శాతానికి పైగా నష్టపోయింది.