Andhra Pradesh: ఏంటీ హుంకరిస్తున్నావ్... నీ మాటేమైనా శాసనమా?: సుజనాపై బొత్స ఫైర్

  • రాజధాని కదిలించడానికి వీల్లేదన్న సుజనా
  • పరోక్ష వ్యాఖ్యలు చేసిన బొత్స
  • చంద్రబాబుకు తొత్తువా అంటూ ఆగ్రహం

ఏపీ రాజధాని అమరావతేనని, రాజధానిని ఒక్క అంగుళం కదిలించడానికి కూడా వీల్లేదని, రాజధానిని తరలిస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

"టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన ఓ రాజ్యసభ సభ్యుడు ఇందాక చెబుతున్నాడు... రాజధాని ఒక్క అంగుళం కూడా కదలడానికి వీల్లేదంట! అలా కదిలిస్తే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదని చెబుతున్నాడు. ఇప్పుడు నేను చెబుతున్నాను... నీ మాటేమైనా శాసనమా? నీ మాట వేదమా? నీకేమైనా మోదీగారొచ్చి చెవిలో చెప్పారా? నువ్వేమైనా చంద్రబాబునాయుడి తొత్తువా? ఏంటి, రాజధాని కదలనివ్వనని హుంకరిస్తున్నావ్!" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, తమ ప్రాంతానికే చెందిన టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపైనా బొత్స వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రాచరికం చేశారని, ఆ ప్రాంత ప్రజల కోసం ఏమీ చేయకుండా ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్నావే, ఈ ప్రాంతానికి చిన్న అభివృద్ధి పనైనా తీసుకువచ్చావా? అని ప్రశ్నించారు. మా తాతలు, తండ్రులు మంత్రులుగా చేయలేదు కానీ నాకు అవకాశమొచ్చిందని చంకలు గుద్దుకున్నావే తప్ప నీవల్ల ప్రజలకు ఒక్క మేలు జరిగిందా? అంటూ నిలదీశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
Visakhapatnam District
Vizag
Botsa Satyanarayana
Sujana Chowdary
YSRCP
Telugudesam
Chandrababu
BJP
  • Loading...

More Telugu News