GVL: ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: జీవీఎల్
- సీఏఏపై అవగాహన కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్టు వెల్లడి
- వివక్షకు గురైన వారికోసమే చట్టం తెచ్చామన్న జీవీఎల్
- సీఏఏను వ్యతిరేకించడం అర్థరహితమని వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం రేకెత్తిస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. విపక్షాలు ఓటు బ్యాంకు కోసమే సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. సీఏఏపై ప్రజల్లో మరింత అవగాహన కోసం సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎవరైతే మతప్రాతిపదికన వివక్షకు గురయ్యారో వారికి పౌరసత్వం ఇచ్చే విధంగా ఈ చట్టం రూపొందించామని వెల్లడించారు.
అంతకుముందు ఆయన ఓ ట్వీట్ ద్వారా స్పందిస్తూ, కాంగ్రెస్ మద్దతుదారులు సీఏఏ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకించడం అర్థరహితమని అన్నారు. అంతేకాకుండా, ఎన్ పీఆర్ అంటే 'నాన్ పెర్ఫార్మింగ్ రాహుల్' అంటూ ఎక్కడ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తారోనని కాంగ్రెస్ మద్దతుదారులు భయపడుతున్నట్టుందని ఎద్దేవా చేశారు.