Vijayawada: ప్రారంభానికి సిద్ధమవుతున్న విజయవాడ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్
- కొత్త ఏడాదిలో రాకపోకలకు అవకాశం
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతులు మీదుగా ప్రారంభించే అవకాశం
- వన్ వే...టూవే పై తర్జనభర్జన
విజయవాడ బెంజిసర్కిల్ మీదుగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చింది. చిన్నచిన్న పనులు మినహా మిగిలినవి పూర్తి కావడంతో కొత్త సంవత్సరంలో వంతెన ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండర్ పాత్, విద్యుదీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. బెంజిసర్కిల్ లో గంటకు దాదాపు 200 వాహనాలు క్రాస్ అవుతుంటాయి. ఈ కారణంగా ఈ కూడలి చాలా రద్దీగా ఉండి నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతుండేవి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. మూడు లేన్ల ఈ వంతెనపై ఒకేసారి మూడు వరుసల్లో వాహనాలు వెళ్లేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. వంతెన పై వన్ వేనా, టూవేగా ఉపయోగించాలా అన్న విషయంపై పోలీసులు, జాతీయ రహదారుల శాఖ అధికారుల మధ్య తర్జనభర్జన జరుగుతోంది.
రెండు వైపులా వదలాలన్నది పోలీసుల సూచనకాగా, వంతెన నిర్మాణ పరిస్థితుల దృష్ట్యా ఒకవైపు మాత్రమే వినియోగిస్తే మంచిదన్న అభిప్రాయం హైవే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు వైపులా వాహనాలు వదిలితేనే వంతెన నిర్మాణ ప్రయోజనం నెరవేరే అవకాశం ఉందన్నది మరికొందరి వాదన.
పెండింగ్ పనులు పూర్తయి, ఈ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత జనవరిలో వంతెన ప్రారంభించే అవకాశం ఉంది. ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.