Amaravathi: రాజధాని నిర్మాణానికి 1500 ఎకరాలు చాలు : సీపీఎం రాఘవులు
- చంద్రబాబు చెప్పినట్లు అన్ని వేల ఎకరాలు అక్కర్లేదు
- కేపిటల్ ను అమరావతిలోనే కొనసాగించాలి
- ఏపీలో అనిశ్చితితో తెలంగాణకు పెట్టుబడులు
రాజధాని నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లు అన్ని వేల ఎకరాలు అక్కర్లేదని, 1500 ఎకరాలు సరిపోతాయని సీపీఎం సీనియర్ నాయకుడు రాఘవులు అన్నారు. అయితే రాజధానిని అమరావతిలోనే కొనసాగించి నిర్మించాలని సూచించారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అధ్యక్ష తరహా పాలన సాగే దేశాల్లో రాజధానులు వేర్వేరు చోట్ల ఉండవచ్చునని, పార్లమెంటరీ విధానం ఉన్న చోట్ల అలా కుదరదన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనిశ్చిత పరిస్థితులు కారణంగా ఇక్కడికి వచ్చే పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించి తరలించుకుపోతోందని విమర్శించారు. విశాఖలో జగన్ పర్యటనపై ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఆయన నిరాశకు గురిచేశారన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, ఆ దిశగా సీఎం జగన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ చతికిలపడ్డారని, ఆయన బీజేపీతో అంటకాగే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి దగ్గరవుతున్న వారితో తాము దూరంగా ఉంటామని రాఘవులు స్పష్టం చేశారు.