Jagidish: పోలీసు స్టేషన్ ల తీరును పరిశీలించేందుకు నాటకమాడిన ట్రైనీ ఐపీఎస్... బయటపడిన పోలీసుల నిర్లక్ష్యం!
- ఫోన్ పోయిందంటూ స్టేషన్ కు వెళ్లిన ఐపీఎస్ జగదీశ్
- 45 నిమిషాలు నిలబెట్టి ఇంటరాగేట్ చేసిన పోలీసులు
- నివేదికపై సీరియస్ అయిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్
- రైటర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫిర్యాదిదారుల పట్ల మర్యాద, స్టేషన్ కు వచ్చిన వారిని పలకరించడం వంటివి కాగితాలకే పరిమితమని రుజువు చేశారు ఒంగోలు పోలీసులు. తమ వద్దకు వచ్చే ఫిర్యాదిదారులతో కనీస మర్యాదను కూడా పాటించబోమని చెప్పకనే చెప్పారు. ఓ ట్రైనీ ఐపీఎస్, మారువేషంలో వెళ్లి, స్టేషన్ లో పరిస్థితులను గమనించాలని భావిస్తే, అతనికి వింత అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే...
ప్రకాశం జిల్లాకు ట్రైనీ ఐపీఎస్ గా జగదీశ్ వచ్చారు. స్టేషన్ లో తీరును పరిశీలించేందుకు సెల్ ఫోన్ పోగొట్టుకున్న యువకుని రూపంలో తాలూకా పీఎస్ కు వెళ్లారు. జగదీశ్ వెళ్లిన సమయంలో పోలీసులు ఎవరూ అక్కడ లేరు. రైటర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి వద్దకు వెళ్లి, తన మొబైల్ ఫోన్ పోయిందని చెప్పగా, ఫిర్యాదు తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎప్పుడు పోయింది? ఎక్కడ పోయింది? ఎలా పోయింది? నీది ఏ ఊరు? ఒంగోలు ఎందుకు వచ్చావు? అంటూ సవాలక్ష ప్రశ్నలు వేశారు. చివరకు ఫిర్యాదు తీసుకున్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కాపీ ఇవ్వడానికి నిరాకరించారు. రోజుకు 100 ఫోన్లు పోతుంటాయని, అన్నీ నమోదు చేస్తే తమ సమయం వాటికే సరిపోతుందని అన్నారు.
ఆపై స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ, అవే ప్రశ్నలు అడిగి విసిగించారు. దాదాపు 45 నిమిషాల పాటు జగదీశ్ ను నిలబెట్టే ఇంటరాగేట్ చేశారు. కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు. ఇంతలో అతనికి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటకు వెళ్లిన జగదీశ్, తన వద్దకు వచ్చిన పోలీసు వాహనమెక్కి వెళ్లిపోయారు. జగదీశ్, ఫోన్ లో మాట్లాడుతూ పోలీసు వాహనం ఎక్కడాన్ని చూసిన తరువాతే, స్టేషన్ లోని సిబ్బందికి ఆయనెవరో తెలిసింది. ఆపై వారికి ముచ్చెమటలు పట్టాయి.
ఇక ఒంగోలు తాలూకా పీఎస్ లో తాను ఎదుర్కొన్న పరిస్థితిపై తయారు చేసిన నివేదికను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు అందించారు జగదీశ్. స్టేషన్ లో మంచి వాతావరణం లేదని తేల్చి చెప్పారు. స్టేషన్ లో ఉండాల్సిన రిసెప్షన్ కౌంటర్ లేదని, రిసెప్షనిస్ట్ లేదని, బాధితుల పట్ల పోలీసుల ప్రవర్తనా తీరు దారుణమని రిపోర్ట్ లో పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ, స్టేషన్ లో ఆ సమయంలో ఉన్న రైటర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎస్ హెచ్ఓగా ఉన్న ఇన్ స్పెక్టర్ ఎం లక్ష్మణ్, ఎస్సై సాంబశివరావులకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదిదారుపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు, కానిస్టేబుల్ ఎంవీ రాజేశ్, మహిళా కానిస్టేబుల్ ఎం. రమ్య కిరణ్మయిలపై తక్షణ క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.