Crime News: ఇంట్లో తెలియకుండా రూ.లక్ష పెట్టి బైక్ కొన్న బాలుడు : పీకల మీదికి తెచ్చిన ప్రమాదం
- ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
- విషయం వెలుగు చూడడంతో కుటుంబం ఆశ్చర్యం
- షోరూం నిర్వాహకులతో వాగ్వాదం
వెయ్యి కాదు...రెండు వేలు కాదు...ఏకంగా లక్ష రూపాయలు. అదీ పది హేడేళ్ల వయసులో ఇంట్లో తెలియకుండా ఖర్చుచేసి మోటారు సైకిల్ కొనే సాహసం. అదే బైక్ తో ఏక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైతేగాని కుటుంబ సభ్యులకు విషయం తెలిసి రాలేదు. తీరా తెలిశాక కంగుతినడం వారి వంతయింది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నాచారం సమీపంలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ బాలుడు ఇటీవల మోటారు సైకిల్ పై వెళ్తూ ఘటకేసర్ సమీపంలో ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
కేసు నమోదుచేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన బాలుడి గురించి ఆరాతీయగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ బాలుడు తన సోదరుడితో కలిసి సెప్టెంబరు 30న బేగంపేటలోని ఓ షోరూంలో లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నాడు. హాస్టల్ లో ఉండి చదువుకుంటూ ఉండడంతో కుటుంబసభ్యులకు ఈ విషయం తెలియదు. బండి కూడా హాస్టల్ లోనే ఉంచి వాడుతున్నాడు.
ప్రమాదం జరిగాకే విషయం వెలుగు చూడడంతో కుటుంబసభ్యులు కంగుతిన్నారు. బైక్ అమ్మిన షోరూం నిర్వాహకుల వద్దకు వెళ్లి నిలదీశారు. చిన్న కుర్రాడికి బండి ఎలా అమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.