Ramana Deekshitulu: తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరిగి కీలక పదవిని పొందిన రమణ దీక్షితులు!

  • మిరాశీ కుటుంబాల్లో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులు
  • పదవిని కోల్పోయిన తరువాత విమర్శలు
  • జగన్ సీఎం కాగానే, తిరిగి కీలక పదవులు

రమణ దీక్షితులు... ఒకప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రధానార్చకులు. ఆపై తెలుగుదేశం ప్రభుత్వం అర్చకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు కుదించగా, పదవిని కోల్పోయిన వ్యక్తి. ఆపై ఆయన తన నిరసనను వ్యక్తం చేస్తూ, చేసిన ఆరోపణలు సంచలనాన్ని కలిగించాయి. ఈ ఆరోపణలు అవాస్తవమని, దేవాలయ పరువును రమణ దీక్షితులు తీశారని ఆరోపిస్తూ, గత సంవత్సరం అక్టోబర్ లో టీటీడీ రూ. 200 కోట్ల పరువు నష్టం దావాను కూడా వేసింది.

ఇప్పుడు అదే రమణ దీక్షితులు ఆలయంలో గౌరవ ప్రధానార్చకునిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆయన నేరుగా ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనరని, ప్రస్తుతం ఉన్న నలుగురు ప్రధాన అర్చకులతో పాటే ఆయన కూడా ఉంటారని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని బోర్డు ప్రకటించింది.

ఇక రమణ దీక్షితులు పునరాగమనం అంత సులువుగానేం జరగలేదు. స్వామివారి కైంకర్యాలు నిర్వహించే మిరాశీ కుటుంబాల్లో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులు, మిరాశీ వ్యవస్థ రద్దయినప్పటి నుంచి ప్రధానార్చకునిగా పని చేస్తూ వచ్చారు. దేశ విదేశీ ప్రముఖులు, వీఐపీలకు స్వామి దర్శనాన్ని చేయించి, దగ్గరయ్యారు. 2018 మేలో సమావేశమైన టీటీడీ, పదవీ విరమణ వయసును ప్రకటించడంతో పదవిని కోల్పోయారు. ఆపై అర్చకత్వానికి దూరమైన రమణ దీక్షితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు దగ్గరయ్యారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించగా, రమణ దీక్షితులు తిరిగి వస్తారన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే, గత నెలలో దేవాలయ ఆగమ సలహా మండలిలో సభ్యత్వాన్ని రమణ దీక్షితులుకు ఇచ్చారు. ఇప్పుడు గౌరవ ప్రధానార్చకుని పోస్టునూ ఆయనకు ఇవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News