Cold: ఢిల్లీలో సున్నా డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!
- చలితో ప్రజల తీవ్ర ఇబ్బందులు
- పలు విమానాల రద్దు
- పొగమంచు కారణంగా ప్రమాదాలు
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోయింది. చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట కూడా పొగమంచు కమ్మేయడంతో నగరమంతా ట్రాఫిక్ స్తంభించింది. పలు విమానాలు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. రైళ్లు నిదానంగా నడుస్తున్నాయి. నోయిడా ప్రాంతంలో పొగమంచు కారణంగా దారి కనిపించక, జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో మూడు చోట్ల వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయి.
పశ్చిమ యూపీలోని ప్రయాగ్ రాజ్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలకు పడిపోయాయి. బద్రీనాథ్ ఆలయాన్ని మంచు పూర్తిగా కప్పేసింది. ఈ దేవాలయాన్ని గత నెలలో మూసి వేసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ లో పలు చోట్ల మంచు వర్షం కురుస్తోంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఏజన్సీ పరిధిలోని లంబసింగిలో 1.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ లో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. హైదరాబాద్ లో ఈ సీజన్ లోనే అత్యల్పంగా శనివారం రాత్రి ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు తగ్గింది.