shoaib akhtar: అక్తర్ మాటలను బట్టి పాక్ నిజ స్వరూపం ఏంటో తేలిపోయింది: గంభీర్

  • కనేరియాను హీనంగా చూశారన్న షోయబ్
  • పాక్ వైఖరి ఏమిటో తేటతెల్లమైందన్న గంభీర్
  • టీమిండియా సారథిగా అజారుద్దీన్ 90 టెస్టులకు సారథ్యం వహించాడన్న ఎంపీ

పాక్ జట్టులోని ఏకైక హిందువు అయిన మాజీ క్రికెటర్ డానిష్ కనేరియాతో సహచరులు ఎలా వ్యవహరించిందీ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వెల్లడించి సంచలనం రేపాడు. తమ జట్టులోని ఆటగాళ్లు ప్రాంతాల వారీగా విడిపోయేవారని, కనేరియాను చాలా హీనంగా చూసేవారని పేర్కొన్నాడు. తమతో కలిసి భోజనం కూడా చేయనిచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి వ్యాఖ్యలపై స్పందించిన కనేరియా.. అక్తర్ చెప్పింది ముమ్మాటికీ నిజమని పేర్కొన్నాడు.

షోయబ్ వ్యాఖ్యలపై తాజాగా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ అయిన గౌతం గంభీర్ స్పందించాడు. అక్తర్ మాటలను బట్టి పాకిస్థాన్ నిజస్వరూపం ఏమిటో మరోమారు తేటతెల్లమైందన్నాడు. మహ్మద్ అజారుద్దీన్ భారత జట్టుకు దాదాపు 90 టెస్టుల్లో సారథ్యం వహించాడని గుర్తు చేశాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా క్రికెటర్ అయినా దేశ ప్రజలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నాడు.

దాదాపు 60 మ్యాచుల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కనేరియాకు ఇలా జరగడం సిగ్గు చేటన్నాడు. మహ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ వంటి క్రికెటర్లకు భారత జట్టు ఎంతో గౌరవం ఇచ్చిందని గంభీర్ పేర్కొన్నాడు. నిజానికి మునాఫ్ పటేల్ తనకు  అత్యంత సన్నిహిత మిత్రుడని అన్నాడు. తామందరం కలిసి దేశం గర్వపడేలా ఆడామని పేర్కొన్న గంభీర్.. పాకిస్థాన్‌లో ఇలాంటి వార్తలు రావడం బాధకరమన్నాడు.

  • Loading...

More Telugu News