Ranga Reddy District: పనీపాట లేకుండా తిరుగుతున్న కొడుకు.. విసిగిపోయి చంపేసిన తల్లి

  • రంగారెడ్డి జిల్లా మాడ్గులలో ఘటన
  • కుమారుడి మెడకు చున్నీ బిగించి హత్య
  • మతిస్థిమితం కోల్పోయి చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం

పనీపాట లేకుండా తిరుగుతున్న కుమారుడిని చూసి విసిగిపోయిన ఓ తల్లి అతడిని దారుణంగా హత్యచేసింది. అనంతరం మతిస్థిమితం లేక చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయింది. రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల మండలంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పల్లెతండాకు చెందిన ఇస్లావత్ హరిలాల్ (20) పనీపాట లేకుండా జులాయిగా తిరిగేవాడు. పలుమార్లు చెప్పినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లి చాంది విసిగిపోయింది. ఇక అతడితో లాభం లేదనుకున్న ఆమె ఈ నెల 22న ఇంట్లోనే అతడి మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలో కంపచెట్లలో పడేసింది.

అయితే, హత్య విషయం బయటపడకుండా తండా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. హరిలాల్‌కు మతిస్థిమితం లేదని, భోజనం కూడా సరిగా చేసేవాడు కాదని పేర్కొంది. ఈ కారణంగా బయటకు వెళ్లిన అతడు చనిపోయి ఉంటాడని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా హత్య అని తేలింది. దీంతో ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Ranga Reddy District
Crime News
  • Loading...

More Telugu News