BCG Report: బోస్టన్ నివేదికదీ అదే దారి.. అమరావతికి వ్యతిరేకమే?
- అమరావతి నిర్మాణం తడిసిమోపెడు అవుతుంది
- ఇప్పటికే అభివృద్ది చెందిన నగరమైతే మంచిది
- కృష్ణా నదిపై మూడు వంతెనలు నిర్మిస్తే అమరావతి భూముల ధరలు పెరుగుతాయి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదిక కూడా అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఇందులో.. అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.
పూర్తిగా నూతన నగరాన్ని (గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా) రాజధానిగా అభివృద్ధి చేయడమంటే రాష్ట్ర ఖజానాపై పెనుభారం మోపడమేనని అభిప్రాయపడింది. అదే సమయంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన (బ్రౌన్‌ఫీల్డ్) నగరంలో రాజధానిని ఏర్పాటు చేయడం అన్ని విధాలా మంచిదని బీసీజీ మధ్యంతర నివేదిక పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
రాజధాని వికేంద్రీకరణ ద్వారా అమరావతి రైతులు నష్టపోకుండా చూడడంతోపాటు, విజయవాడను మహానగరంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేసింది. కృష్ణా నదిపై మూడు చోట్ల కొత్తగా వంతెనలు నిర్మించి రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేయడం వల్ల ఆ ప్రాంతంలోని భూముల ధరలు పడిపోకుండా చూడొచ్చని పేర్కొంది.