Amaravathi: అమరావతి నిర్మాణం అదృష్టం.. నిలిపివేయడం విషాదం: ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా
- పశ్చిమ, తూర్పు తీరాల మధ్య తీవ్ర అసమానతలు
- అమరావతిలో దేశ ప్రయోజనాలు ఉన్నాయి
- అమరావతి గొప్ప నగరంగా తయారవుతుందని భావించాం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ పాత్రికేయుడు, రచయిత శేఖర్ గుప్తా.. అమరావతి నిర్మాణాన్ని అదృష్టంగా పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టును నిలిపివేయడం విషాదమని పేర్కొన్నారు. అమరావతి అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని, మొత్తం దేశ ప్రయోజనాలు అక్కడ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన కొత్త ఓడరేవులు, విమానాశ్రయాలన్నీ పశ్చిమ తీరంలోనే ఉన్నాయని, తూర్పు తీరంలో అంతగా అభివృద్ది జరగలేదని అన్నారు.
ప్రస్తుతం తూర్పు, పశ్చిమ తీరాల మధ్య తీవ్రమైన అసమానతలు ఉన్నాయని శేఖర్ గుప్తా పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తూర్పు తీరంలో అమరావతి వంటి గొప్ప నగర నిర్మాణాన్ని తలపెట్టడం అదృష్టంగానే భావించాలని, కానీ ఈ ప్రాజెక్టును నిలిపివేయడం తీవ్ర విషాదమని పేర్కొన్నారు. పాలకులకు మంచి బుద్ధి కలిగి అమరావతి నిర్మాణం కొనసాగితే తూర్పు ప్రాంతంలో గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటుందని శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు.
చాలా రాష్ట్రాల్లో రాజకీయపార్టీల మధ్య పోటీ శత్రుత్వంగా మారుతోందని పేర్కొన్న శేఖర్ గుప్తా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలు గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను నిలిపివేస్తున్నాయని అన్నారు. ఒక ప్రభుత్వం ఐదేళ్లలో ఓ ఆలోచనను ఓ స్థాయికి తీసుకొస్తే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దానిని నాశనం చేయాలని చూడడం అనర్థదాయకమని అన్నారు.
అమరావతిలో మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారని, వారంతా కలిసి అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తారని, ఈ 60 ఏళ్లలో దేశంలోనే నిర్మించిన మొదటి గ్రీన్‌ఫీల్డ్ నగరం అవుతుందని అనుకున్నామని, కానీ దురదృష్టవశాత్తూ అది ఆగిపోయిందని శేఖర్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ధోరణి కారణంగా ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, సింగపూర్ కన్సార్షియం వెనక్కి వెళ్లిపోయాయని, చాలా సంస్థలు రాష్ట్రం నుంచి తమ పెట్టుబడులను విరమించుకున్నాయని శేఖర్ గుప్తా తెలిపారు.