Supreme Court: కన్నబిడ్డను చంపిందన్న కేసులో తల్లికి విముక్తి కలిగించిన సుప్రీంకోర్టు!
- ఆడశిశువును చంపినట్టు మహిళపై ఆరోపణలు
- యావజ్జీవం విధించిన హైకోర్టు
- తల్లి బిడ్డను చంపిందనడం అస్వభావికం అన్న సుప్రీం
- మహిళ నిర్దోషి అని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం
తన బిడ్డను తానే హత్య చేసిందన్న ఆరోపణలపై ఓ మహిళపై నమోదైన కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా అంతిమతీర్పు వెలువరించింది. ఆ తల్లి ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించింది. ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం మహిళకు శిశువు జన్మించగా, ఆడపిల్ల అన్న కారణంతో గొంతు పిసికి చంపేసినట్టు ఆమెపై ఆరోపణలు నమోదయ్యాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలింది. దాంతో అందరూ ఆ మహిళనే వేలెత్తి చూపారు.
2009లో ట్రయల్ కోర్టు తల్లిని దోషిగా పేర్కొనగా, హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది. దాంతో ఆమెకు యావజ్జీవం విధించారు. దీనిపై ఆ మహిళ సుప్రీంలో సవాల్ చేయగా, విచారణ చేపట్టిన సుప్రీం ఆమెను నిర్దోషిగా పేర్కొంది. ఆమెపై మోపిన నిందలు నిరాధారమని పేర్కొంటూ విడుదలకు ఆదేశాలిచ్చింది.
ఓ స్త్రీ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి జన్మనిచ్చిన బిడ్డను హత్య చేసింది అనడం అస్వాభావికం... తల్లి తన బిడ్డను చంపుకుంటుందా? అని సుప్రీం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సుప్రీం ధర్మాసనం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో అరుదు. సున్నితమైన, భావోద్వేగాలతో కూడిన కేసుల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మానవీయ దృక్పథంతో వ్యాఖ్యానించడం గతంలోనూ జరిగింది.