Amaravathi: అప్పటిదాకా అమరావతిని తాకొద్దు: సీఎం జగన్ కు సీపీఐ నారాయణ హెచ్చరిక

  • రాజధానిని మార్చాలనుకుంటే జగన్ తన పదవికి రాజీనామా చేయాలి
  • మళ్లీ ఎన్నికలకు వెళదాం
  • మీరు గెలిస్తే అప్పుడు రాజధాని ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం

రాజధానిని అమరావతిలోనే యధావిధిగా కొనసాగించాలన్న రైతుల కోరికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సీపీఐ నారాయణ అన్నారు. ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులను ఇవాళ ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, రాజధాని మార్పు అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.

రాజధాని అమరావతికి ప్రతిపక్ష నేతగా నాడు మద్దతు చెప్పిన జగన్ ఈరోజున ఎందుకు కాదంటున్నారు? ‘ఒకసారి మాట ఇస్తే తప్పరు కదా?’ అంటూ ప్రశ్నించారు. రాజధాని అమరావతిని తరలిస్తామని వైసీపీ ఎన్నికల ప్రచారంలో కానీ, మేనిఫెస్టోలో గానీ చెప్పలేదని అన్నారు. అధికారంలోకి రాగానే ఇలాంటి ఆలోచన చేయడం సబబు కాదని, దీనికి ప్రజల ఆమోదం లేదని అన్నారు.

ఒకవేళ రాజధానిని తరలించాలని అనుకుంటే కనుక జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఎన్నికలకు వెళదామని, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న నినాదంతో ప్రచారానికి వెళ్లి ‘మీరు కనుక గెలిస్తే అప్పుడు రాజధాని ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం’ అని అన్నారు.

అయితే, అప్పటిదాకా అమరావతిని తాకొద్దని, రాజధానిని తరలించాలన్న ఆలోచన చేయొద్దని హెచ్చరించారు. రాష్ట్రానికి సెంటర్ పాయింట్ గా ఉన్న ప్రాంతంలో రాజధాని ఉందని, అక్కడి నుంచి తరలించాలని అనుకోవడం సరైన ఆలోచన కాదని, కక్షపూరితంగా వ్యవహరించొద్దని సూచించారు.

Amaravathi
capital
cm
jagan
CPI Narayana
  • Loading...

More Telugu News