Danesh Kaneria: హిందూ క్రికెటరనే కనేరియాను అవమానించారు: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
- పాక్ జట్టులో చోటు సంపాదించిన రెండో హిందూ క్రికెటర్
- తొలిసారిగా అనిల్ దల్పాత్ పాక్ జట్టుకు ఎంపిక
- అవమానాలు ఎదుర్కొన్నది నిజమేనన్న కనేరియా
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో స్థానం సంపాందించిన.. హిందూ క్రికెటర్ డానిష్ కనేరియాపై జట్టు సహచరులు వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారని ఆ దేశ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరుపొందిన షోయబ్ అక్తర్ చెప్పాడు. కనేరియాను సహచరులు కరాచీ, పంజాబ్ పేర్లు చెబుతూ.. అవమానించారని అన్నాడు. పాకిస్థాన్ లో ప్రసారమవుతోన్న ‘గేమ్ ఆన్ హాయ్’ కార్యక్రమంలో షోయబ్ ఈ వివరాలను వెల్లడించాడు.
కార్యక్రమంలో షోయబ్ మాట్లాడుతూ.. కనేరియాకు ఎదురైన అవమానాలను ప్రస్తావించాడు. కొంతమంది పాక్ క్రికెటర్లు ప్రాంతీయ వాదం గురించి మాట్లాడేవారని.. కరాచీ నుంచి వచ్చిందెవరు? పంజాబ్, పెషావర్ నుంచి ఎవరైనా వచ్చారా? అంటూ అడిగేవారని గుర్తు చేశాడు. కనేరియా హిందువే అయినా.. జట్టుకోసం బాగా ఆడాడని చెప్పాడు. అతడి వల్లే ఇంగ్లండ్ పై టెస్టుల్లో తాము సిరీస్ గెలుచుకున్నామన్నాడు. అయితే ఈ ఘనత కనేరియాకు దక్కనివ్వలేదని చెప్పాడు.
అవమానాలు నిజమే: కనేరియా
అక్తర్ వ్యాఖ్యలపై కనేరియా స్పందిస్తూ.. తనకు జరిగిన అవమానాలు నిజమేనని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా అక్తర్ వ్యాఖ్యలు భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. కర్ణాటక బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో అక్తర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. విదేశీ మైనారిటీలకు అండగా నిలవడం తప్పా? అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లలో వైరల్ గా మారింది.
పాక్ జట్టులో రెండో హిందూ క్రికెటర్ కనేరియా
పాక్ జట్టులో ఒక హిందువు స్థానం సంపాదించడమంటే సంచలనమే.. అదీ రెండు సార్లు జరిగింది. తొలిసారిగా అనిల్ దల్పాత్ పాక్ జట్టులో చోటు దక్కించుకోగా, రెండో సారి డానిష్ కనేరియా జట్టులో స్థానం పొందాడు. కనేరియా తన స్పిన్ బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ కాళ్లు చేతులు ఆడనీయకుండా చేసేవాడు. అతడి బౌలింగ్ ప్రతిభతో ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ ను పాక్ గెలుచుకుంది.