Municipal Elections Telangana: మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది: కేటీఆర్ ధీమా
- ప్రజలకు కావలసిన సౌకర్యాల కల్పనలో పురోగతి సాధించాం
- సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు సాగుతాం
- చరిత్రలో ఎన్నడూ లేనంతగా మునిసిపాలిటీలకు నిధులు కేటాయించాం
తెలంగాణలో త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు విజయం ఖాయమని పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు సాగుతామన్నారు.
కేసీఆర్ కిట్, ఆసరా, పింఛను, రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కేసీఆర్ కార్యదక్షత, నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం, ప్రభుత్వం పనితీరులే తమకు కొండంత బలమని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేసిన పనిని ప్రజలకు చెబుతూ.. ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించామన్నారు.
రాష్ట్రంలో మొత్తం 141 మునిసిపాలిటీలున్నాయని... ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే అజెండాతో తాము ముందుకెళుతున్నామన్నారు. ప్రజలకు కావలసిన సౌకర్యాల విషయంలో ఇప్పటికే పురోగతి సాధించామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మునిసిపాలిటీలకు నిధులు కేటాయించామని చెప్పారు. ప్రజలకు అవసరమైన వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. తమ పార్టీ 60 లక్షల మంది సభ్యులతో బలమైన శక్తిగా ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
గడిచిన ఐదేళ్లలో తాము ఎక్కడా నేల విడిచి సాముచేయలేదన్నారు. ప్రజలకు కావలసిన కనీస మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన, సేవలందించే అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేశామన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, తెలంగాణ మునిసిపల్ చట్టం తీసుకువచ్చామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలిచ్చిందని పేర్కొన్నారు. పట్టణాల్లో విద్యుత్, తాగునీరు అందించే విషయంలో ప్రజలకు చెప్పిందే చేసి చూపించామన్నారు.